
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:
పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు నిర్ణయంపై కృతజ్ఞత సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఓపీఎస్ అమలు కోసం అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదని, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకు న్యాయం జరిగిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
గిద్దలూరు నియోజకవర్గంలో 2003 డీఎస్సీకి చెందిన 30 మంది ఉపాధ్యాయులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.అనంతరం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని శాలువాతో సత్కరించి, పూలమాల వేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులతో పాటు కూటమి ప్రభుత్వ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.