google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

పి 4 తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :-
పేద పిల్లలకు కార్పొరేట్ విద్యనందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం టంగుటూరులోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎస్.సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు పాఠశాలలోని వంటగది, తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి, వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్డ్ టెలిఫోన్ సదుపాయాన్ని పరిశీలించిన మంత్రులు, స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. పిల్లల చదువు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఆప్యాయంగా సంభాషించారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తమ ర్యాంకులే ఇక్కడి విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల
వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కొండపి నియోజకవర్గానికి రెండు కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను (బాలికలకు 1, బాలురకు 1) మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ శాఖలో 3, బీసీ సంక్షేమ శాఖలో 2, గిరిజన సంక్షేమ శాఖలో 1, మైనారిటీ సంక్షేమ శాఖలో 1 చొప్పున విద్యాసంస్థలను అటాచ్ చేస్తున్నట్లు వివరించారు. చదువులో వెనుకబడిన పిల్లలను 'రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్' ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ట్రాకింగ్ చేసి, వారికి విద్యా సాధికారత (Education Empowerment) కల్పిస్తామన్నారు. పి 4 (P4) వర్గానికి చెందిన వారైనా, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారైనా… విద్య ద్వారానే పేదరికాన్ని జయించి ఉన్నత స్థాయికి చేరుకోగలరని, అందుకే ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తోందని మంత్రి డా.స్వామి స్పష్టం చేశారు.