
తొలి శుభోదయం న్యూస్ న్యూఢిల్లీ:-
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించి వినతిపత్రాలు సమర్పించింది. ముఖ్యంగా ఆక్వా, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, రైతులు, ఎగుమతిదారులకు ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.మొదటగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను ఆయన నివాసంలో రాష్ట్ర మంత్రుల బృందం కలిసి అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (NFDB) ప్రాంతీయ కార్యాలయంతో పాటు ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ (AQF) ఏర్పాటును వేగవంతం చేయాలని కోరింది.ఇప్పటికే విశాఖపట్నంలో జరిగిన ఎగుమతుల వాణిజ్య సదస్సులో కేంద్ర మంత్రి ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేసిన రాష్ట్ర ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.146 ద్వారా అమరావతి సమీపంలో 7.89 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. డీపీఆర్ తయారీ, పరిశీలనలు, ఆర్థిక అనుమతులు, నిధుల విడుదల, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 2028 నాటికి ఈ కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని వివరించారు.ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల NFDB ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ, శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చి రాష్ట్ర ఆక్వా రంగానికి, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే నమ్మకమైన బ్రూడ్ స్టాక్ తయారీ సంస్థల విస్తరణకు, క్వారంటైన్ నిబంధనల్లో అవసరమైన సడలింపులు కల్పించి 2021 నాటి భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.అనంతరం ఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రైతులు, ఎగుమతిదారుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంపై లక్షలాది మంది రైతులు, కార్మికులు, హేచరీలు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు గణనీయంగా తగ్గిపోవడం, మరోవైపు ఫీడ్ ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రెండు కీలక నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర బృందం కోరింది. ఫిష్ మీల్ ఎగుమతులను నియంత్రించి దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఫీడ్ తయారీ వ్యయాన్ని తగ్గించాలని, అలాగే నమోదిత రొయ్యల ఫీడ్ తయారీ సంస్థలకు మాత్రమే పరిమిత స్థాయిలో, 2021 నాటి విధానాన్ని అనుసరించి తగిన నియంత్రణలతో జన్యుమార్పిడి (GM) సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.ఈ చర్యల వల్ల ఫీడ్ తయారీ ఖర్చు తగ్గి రైతుల ఆదాయం మెరుగుపడటంతో పాటు, భారత రొయ్యల ఎగుమతుల పోటీతత్వం పెరిగి విదేశీ మారకద్రవ్య ఆదాయం పెరుగుతుందని, లక్షలాది కుటుంబాల జీవనోపాధికి భరోసా లభిస్తుందని మంత్రులు వివరించారు.అదేవిధంగా పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు. భారతదేశంలో ఎఫ్‌సీవీ (FCV) పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ రంగంపై లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.ప్రస్తుతం పొగాకు ఎగుమతిదారులకు తగిన ప్రోత్సాహకాలు లేకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో HS Code 2401 (2401 10, 2401 20, 2401 30) కింద ఉన్న అన్‌మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుకు RoDTEP పథకాన్ని వర్తింపజేయడంతో పాటు, Interest Equalisation Scheme (NIRYAT PROTSAHAN) పరిధిలోకి కూడా తీసుకురావాలని కోరారు.2021-22లో 105.21 మిలియన్ కిలోల (విలువ ₹2,909.99 కోట్లు) ఉన్న భారత ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులు, 2025-26 నాటికి 155.05 మిలియన్ కిలోలకు (విలువ ₹7,782.98 కోట్లు) పెరిగాయని, ఇది భారత పొగాకు నాణ్యతకు నిదర్శనమని వివరించారు.అయితే జింబాబ్వే, బ్రెజిల్ వంటి దేశాలు తమ ఎగుమతిదారులకు భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నందున, భారత పొగాకు ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాలను త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా, పొగాకు రైతుల సంక్షేమం, ఆయా రంగాల స్థిరాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ అంశాలను కేంద్ర మంత్రులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రుల బృందం వెల్లడించింది.
