
విజయవంతమైన శస్త్రచికిత్సతో కొత్త జీవితం ప్రసాదించిన ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ కళ్యాణ్ కుమార్
హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నిధులతో సహకరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
ప్రత్యేక చొరవ చూపిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. బంధువులు లేని ఓ నిరుపేద, అనాథ రోగికి అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.మూడు వారాల క్రితం గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా, రవికుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆయన ఎడమ కాలు తుంటి ఎముక విరిగాయి. వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వంటి గుర్తింపు పత్రాలు లేకపోవడం, చూసుకునే బంధువులు ఎవరూ లేకపోవడంతో సకాలంలో చికిత్స అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ విషయం తెలుసుకున్న రవికుమార్‌కు దూరపు బంధువులు కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి, ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ కళ్యాణ్ కుమార్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. రోగికి ఎవరూ తోడుగా లేరని, కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.వెంటనే స్పందించిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి, డాక్టర్ కళ్యాణ్ కుమార్ రోగిని కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాల లో చేర్పించినా ఆనంతరం అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు.పరీక్షల అనంతరం రవికుమార్‌కు తుంటి ఎముకకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే శస్త్రచికిత్సకు అవసరమైన ప్రత్యేక ఇంప్లాంట్లు, వైద్య పరికరాల కోసం రూ.10 వేలకుపైగా వ్యయం అవసరమైంది.ఈ విషయాన్ని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నిధుల ద్వారా అవసరమైన వైద్య సామగ్రి సమకూర్చేందుకు అనుమతి ఇచ్చారు.అనంతరం ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ కళ్యాణ్ కుమార్ అత్యంత నైపుణ్యంతో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం రోగికి నిరంతరం పర్యవేక్షణతో మెరుగైన వైద్య సేవలు అందించడంతో రవికుమార్ పూర్తిగా కోలుకుని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, తనకు కొత్త జీవితం ప్రసాదించిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి, విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించిన ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ కళ్యాణ్ కుమార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు సేవాభావంతో అందిస్తున్న వైద్య సేవలను స్థానిక ప్రజలు అభినందిస్తూ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.