
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ప్రజా గాయకుడు సామాజిక చైతన్యమై ఎగసిన విప్లవ కెరటం ప్రజల గుండెల్లో నిలిచిన అమర గాయకుడు గద్దర్ చిరస్మరణీయుడిగా ప్రజా బహుళయంలో నిలిచిపోతారని మూడవ వర్ధంతి సభలో మాట్లాడిన వక్తలు అభిప్రాయపడ్డారు. కందుకూరు పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద గద్దర్ అభిమానుల ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించటం జరుగింది. ఈ కార్యక్రమాన్నికి ప్రముఖ అంబేద్కరిస్ట్ గేరా.చిరంజీవి అధ్యక్షత వహించి మాట్లాడుతూ గద్దర్ మరికొంత కాలం జీవించి ఉంటే దళిత బహుజన శ్రామిక బలహీన వర్గాల ప్రజలు పక్షాన నిలబడి పోరాడే వారని అన్నారు. జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ విప్లవ సాహిత్య సాంస్కృతిక కళాకారునిగా, కవిగా, రచయితగా గద్దర్ విప్లవ శ్రామిక కూలి తల్లి పక్షాన పాడిన వాడు గద్దర్. కార్మిక,కర్షక,విద్యార్థి, ఉద్యోగ,శ్రమైక జీవనసౌందర్య, పకృతి కవిత్వాన్ని ఆటగా, పాటగా మలిచిన యోధుడని కొనియాడారు. ప్రజాయుద్ధనౌకగా తన అంబులపొదిలో తాడిత, పీడిత, బాధితుల బాధలను, గాధలను గానం చేసే రాగాలను పొదిగాడని అన్నారు. మహాకవి గుర్రం జాషువా అన్నట్లు కుల మతాల గీతలు ఎన్ని గీసిన కట్టుబడని విశ్వనరుడు గద్దర్ అని అన్నారు. గద్దర్ తన నమ్మిన సిద్ధాంతాల కోసం ఏనాడు ప్రజాపక్షం వదలలేదని,తన మరణ వాంగ్మూల గానములో కూడా మూగబోయిన గొంతులు రాగం మెవరు తీసేదరు, చినిగిన ఆ దోతి రుమాలుని ఎవరు చుట్టుకుందురో, అలిగిన ఆ గొంగడి బొంతను ఎవరు అలుముకుందురోనని, చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసేదరోనని మనల్ని కార్యోన్ముఖులను చేసి గద్దర్ వెళ్లిపోయారని నివాళులు అర్పించారు. ఉపాసక గాండ్ల హరిప్రసాద్ మాట్లాడుతూ గద్దర్ చివరి రోజుల్లో అంబేద్కరిస్ట్ గా మారి బౌద్ధాన్ని ఆచరించారని గుర్తు చేశారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని నినాదాలు చేశారు. సభ ప్రారంభంలో విప్లవ యోధుడు అమర గాయకుడు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రారంభంలో ఈ మధ్యకాలంలో అమరులైన విప్లవ గాయకులు, వాగ్గేయకారులు అరుణోదయ నాగన్న, రామారావు, వంగపండు ప్రసాదు, గద్దర్ స్మృతికి సభ మొత్తం లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు పొనుగోటి ప్రభాకర్ గద్దర్ పైన రాసి రాగాలను సమకూర్చి పాడిన పాటలు సభికులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో బి వెంకటేశ్వర్లు,కల్లగుంట మోహన్ రావు, షేక్ అబ్దుల్లా, శ్రీరామ చిన్నమాల కొండయ్య, కట్టాసుచరిత షేక్ రహీమ్ గేరా.మనోహర్, ఎరమాల నాగభూషణం, చనమాల కోటేశ్వరరావు, చెక్క సింగయ్య,సూర్యం, అంజయ్య,సిద్దయ్య రామారావు, పంది నరసింహాం, మాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.