
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండల బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న మూడు రోజుల జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని టంగుటూరు ప్రాజెక్టు సీడీపీఓ వై. అంజమ్మ సందర్శించారు.ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ, పునాది అభ్యసన స్థాయి బలంగా ఉండేందుకు అంగన్వాడీ కార్యకర్తలు తల్లిదండ్రుల కమిటీతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. కమ్యూనిటీ భాగస్వామ్యంతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరూ అంగన్వాడీ కేంద్రాలకు హాజరై అభ్యసనతో పాటు పౌష్టికాహారం పొందేలా తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులు సహకరించాలని అన్నారు. చిన్నారుల అభ్యసన కార్యక్రమాల్లో తల్లులు ప్రత్యక్షంగా భాగస్వాములై, ఇంటి వద్ద కూడా పిల్లల అభ్యసన నైపుణ్యాలు మెరుగుపడేందుకు సహకరించాలని కోరారు.మండల విద్యాశాఖ అధికారులు కత్తి శ్రీనివాసులు, ఆవుల శ్రీనివాసరావు శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో, అంకితభావంతో శిక్షణలో పాల్గొంటూ 100 శాతం హాజరు నమోదు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న కృత్యాలు, బోధనా మెళకువలను చిన్నారులకు సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్ (TLM)ను స్వయంగా తయారుచేసి ప్రదర్శన ఏర్పాటు చేయడాన్ని వారు అభినందించారు.రిసోర్స్ పర్సన్లు శిక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, వారి మార్గదర్శకత్వం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు మరిన్ని బోధనా మెళకువలను అందిపుచ్చుకుని చిన్నారుల పునాది అభ్యసనను బలోపేతం చేయాలని అధికారులు సూచించారు.కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు, రిసోర్స్ పర్సన్లు ఆర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, కీర్తి శ్రీనివాసరావు, సూపర్వైజర్ లు సైదాబీ, కుసుమ, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
