
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
బాపట్ల జిల్లా కాజీపాలెంలో ఇటీవల జరిగిన 12వ రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్-2026 పోటీలలో ద్వితీయ స్థానం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నెల్లూరు జిల్లా బాలికల జట్టును కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శుక్రవారం నెల్లూరులోని VPR కార్యాలయంలో అభినందించారు. విజేతలకు మెడల్స్, శాలువాలు, సర్టిఫికెట్లను బహుకరించి, సత్కరించారు. ఆగస్టు 10, 11, 12 తేదీలలో జరిగిన ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో నెల్లూరు జిల్లా జట్టు తరఫున అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టి.తులసి, అక్షర, భవ్య శ్రీ, నికిత, విష్ణు ప్రియ వచ్చే అక్టోబర్ నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరగబోయే జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు తరఫున ఎంపికయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ, మన నెల్లూరు జిల్లా బాలికలు రాష్ట్రస్థాయిలో రన్నరప్‌గా నిలవడం, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. లక్నోలో జరిగే జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చాటాలని, రాష్ట్రానికి, జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, వీరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెవుల యుగంధర్, సెక్రటరీ పి.అజయ్ కుమార్, అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.