
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ పంచాయతీలో డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ మిషనరీలను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి. చిరంజీవి, ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి ఎం. అనుపమ ప్రారంభించారు.PWMU కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, విజయవాడ అందజేసిన ఈ మిషనరీల ద్వారా గ్రామంలో పొడి వ్యర్థాల వర్గీకరణ, ప్రాసెసింగ్, నిల్వ, రీసైక్లింగ్ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించనున్నారు.ఇందులో కన్వేయర్ బెల్ట్ మిషన్, ప్లాస్టిక్ ష్రెడర్ మిషన్, ప్లాస్టిక్ బేలింగ్ మిషన్, వెయింగ్ మిషన్‌తో పాటు రెండు పుష్ కార్ట్స్ ఉన్నాయి. కన్వేయర్ బెల్ట్ ద్వారా ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహం వంటి వ్యర్థాలను వేరు చేయవచ్చని, ష్రెడర్ ద్వారా ప్లాస్టిక్‌ను చిన్న ముక్కలుగా చేసి రీసైక్లింగ్‌కు సిద్ధం చేయవచ్చని అధికారులు వివరించారు. బేలింగ్ మిషన్ ద్వారా ప్లాస్టిక్‌ను కట్టలుగా మార్చి నిల్వ, రవాణాను సులభతరం చేయవచ్చన్నారు. వెయింగ్ మిషన్ ద్వారా సేకరించిన వ్యర్థాల బరువును నమోదు చేయడంతో పాటు, పుష్ కార్ట్స్ ద్వారా ఇంటింటి నుంచి పొడి వ్యర్థాలను సేకరించవచ్చని తెలిపారు.ఈ మిషనరీలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా గ్రామంలో శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ సాధ్యమవుతుందని క్లాప్ మిత్రలు, గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి. వెంకట్రావు, డిప్యూటీ ఎంపీడీవో పి. శారద, SBM కన్సల్టెంట్స్, పంచాయతీ అభివృద్ధి అధికారి సి.హెచ్. వెంకట్రావు పంచాయతీ జూనియర్ సహాయకుడు ఎం. రామయ్య, పత్రికా విలేకర్లు, పంచాయతీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, స్వచ్ఛ రథం ఆపరేటర్లు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.