
వాహనం సీజ్.. నలుగురిపై కేసు నమోదు
రేషన్ డీలర్‌పై 6-ఏ కేసు నమోదు చేసిన సివిల్ సప్లైస్ అధికారులు..
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని వాహనాన్ని సీజ్ చేశారు. పొదలకూరు నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వాహనాన్ని గుర్తించి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 29 బస్తాల రేషన్ బియ్యం బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించారు. విచారణలో పొదలకూరు రేషన్ షాప్ నంబర్ 53 డీలర్ పువ్వాడ ప్రవీణ్ చిట్టేపల్లిలోని తన దుకాణం నుంచి 29 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు డీలర్‌పై 6-ఏ కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు. అలాగే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసిన రాపూరు మండలం రాంకూరు గ్రామానికి చెందిన ఎద్దల పెంచల నరసయ్య, ఆటో యజమాని పామర్తి పెంచల నరసయ్య, ఆటో డ్రైవర్ పామర్తి బాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, విక్రయించడం, తరలించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తారని స్పష్టం చేశారు.