
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
పాకల స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోపర్ల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభా కార్యక్రమానికి పాకల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ మేనేజర్ నాగ బ్రహ్మచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ఒకే వేదికపై రెండు ముఖ్యమైన దినోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమని, ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ప్రేరణ పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి నాగ బ్రహ్మచారి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ, నిరంతర కృషితో సాధించలేనిది ఏదీ లేదని, క్రమశిక్షణతో కూడిన చదువుతోనే ఉన్నత స్థానాలు లభిస్తాయని విద్యార్థులకు ఉద్బోధించారు.
తెలుగు ఉపాధ్యాయులు తిరుమల రావు, బి. వినయ్ వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు సేవలను, భాషా విశిష్టతను వివరించారు. బయాలజీ ఉపాధ్యాయుడు డి. విజయానంద్ నన్నయ, తిక్కన, ఎర్రనలతో పాటు అష్టదిగ్గజ కవులు, ఆధునిక కవులైన శ్రీశ్రీ, జాషువా, గురజాడ, దేవులపల్లి సేవలను స్మరిస్తూ పద్యాలు, పాటలతో అలరించారు.
పీడీలు వడ్లమూడి కోటేశ్వరరావు, తేళ్ల వంశీకృష్ణ క్రీడల ప్రాధాన్యాన్ని వివరించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ.. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ 1928-1936 మధ్య ఒలింపిక్స్లో 3 స్వర్ణ పతకాలు తెచ్చిన తీరును, జర్మనీ అధినేత హిట్లర్ ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించి దేశభక్తిని చాటుకున్న వైనాన్ని వివరించారు.
అనంతరం, తెలుగు క్విజ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు, క్రీడా పోటీలలో గెలుపొందిన సీనియర్, జూనియర్ విభాగాల విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. వేడుకల అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి. శంకర్రావు, సిహెచ్. మనోహర్, శ్రీదేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.