
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లోని పది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు శానంపూడి గ్రామానికి చెందిన దింటకుర్తి బాలకృష్ణ, తాను పనిచేస్తున్న కార్పొరేట్ కంపెనీ ద్వారా ఉల్లాస్ ట్రస్ట్ సహకారంతో వంద మంది విద్యార్థులకు లక్ష రూపాయల స్కాలర్షిప్ ఉచితంగా పంపిణీ చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిధి పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తూ స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన సహకారం అందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు.అదేవిధంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విద్య ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఆర్థిక పరిస్థితులు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారకూడదని, విద్యార్థులను ప్రోత్సహించేందుకు వ్యక్తులు, సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తమ కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి చొరవ తీసుకున్నట్లు తెలిపారు. మెరిట్ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి, వారి భవిష్యత్ లక్ష్యాల సాధనకు చిన్న సహకారం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.ఈ స్కాలర్షిప్లను పాకల, శానంపూడి, ఉల్లపాలెం, సింగరాయకొండ పట్టణంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, పాత సింగరాయకొండ, రామాయపట్నం, చాకిచర్ల, భీమవరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించారు.సోమవారం సింగరాయకొండ రైల్వే రోడ్డులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె మహాలక్ష్మి అధ్యక్షత వహించగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉల్లాస్ ట్రస్ట్ సిబ్బంది శిరీష, కోటేశ్వరరావు పాల్గొన్నారు.