
తొలి శుభోదయం న్యూస్ సింరాయకొండ : -
కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం సింగరాయకొండ మండలం కళికవాయి గ్రామంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వయంగా పాల్గొని, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, వృద్ధులకు, వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో ప్రభుత్వం" అనే ఆశయంతో ప్రతి నెల మొదటి రోజునే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు దాదాపు రూ. 2,700 కోట్లకు పైగా సామాజిక భద్రత పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయమే లబ్ధిదారుల ఇంటి గుమ్మం వద్దకే అధికారుల ద్వారా పింఛన్ సొమ్మును ఎంతో పారదర్శకంగా చేరవేస్తున్నామని వివరించారు. పెంచిన పింఛన్ సొమ్ము లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోందని, ముఖ్యంగా వృద్ధులు మరియు దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా సమాజంలో స్వేచ్ఛగా, గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతోందని హర్షం వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయానికి అతీతంగా సంక్షేమ ఫలాలు అందించడమే తమ నైతిక బాధ్యతని, రాబోయే రోజుల్లో కూడా పేదల సంక్షేమానికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హామీ ఇచ్చారు. మంత్రి గారి చేతుల మీదుగా పింఛన్ అందుకున్న లబ్ధిదారులు సమయానికి సాయం అందిస్తున్న ప్రభుత్వం పట్ల తమ సంతోషాన్ని, కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.
కళికవాయి - నందనవనం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
రాష్ట్రంలో సురక్షితమైన మరియు మౌలిక వసతులతో కూడిన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం ద్వారానే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకోసమే ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా కాళికవాయి గ్రామం నుండి నందనవనం వరకు రూ. రూ. 1.73 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఇరు గ్రామాల మధ్య రవాణా కష్టాలు తీరడమే కాకుండా, స్థానిక ప్రజలకు, రైతులకు తమ ఉత్పత్తులను సమీప మార్కెట్లకు తరలించడం ఎంతో సులభతరం కానుందని వివరించారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని అత్యంత కీలకమైన 9 రహదారుల పునర్నిర్మాణం మరియు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ. 22.50 కోట్ల భారీ నిధులను మంజూరు చేశారని వెల్లడించారు. గతంలో దెబ్బతిన్న రోడ్లను సంపూర్ణంగా బాగుచేసి, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా గుంతలు లేని నాణ్యమైన రహదారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పంచాయతీ రాజ్ శాఖ వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒకవైపు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా అందిస్తూనే, మరొకవైపు మౌలిక వసతుల కల్పనే ప్రధాన ప్రాతిపదికగా అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తోందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
