
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
నాగార్జున పబ్లిక్ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పాఠశాల డైరెక్టర్ వి.శాలినీరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ఆకట్టుకున్నారు. భక్తిగీతాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, శ్రీకృష్ణుని బాల్యలీలలను ప్రతిబింబించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ఆవరణను అందంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ సందర్భంగా డైరెక్టర్ వి. శాలినీ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకృష్ణాష్టమి భారతీయ సంస్కృతిలో ఎంతో విశిష్టమైన పండుగ అని తెలిపారు. శ్రీకృష్ణుని జననం ధర్మం, సత్యం, న్యాయం, ప్రేమ వంటి గొప్ప విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అందించిన కర్తవ్యనిష్ఠ, ధర్మబద్ధమైన జీవనం వంటి సందేశాలు నేటి తరానికి ఎంతో అవసరమని అన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు నైతిక విలువలను అందించడమే పాఠశాల లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి. శివ కుమార్, యాజమాన్య ప్రతినిధులు వి. మర్రెడ్డి, కె. శ్రీనివాసరావు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.