
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే విధంగా గతంలో కేటాయించిన స్థలంలో ఆరామ క్షేత్రాన్ని నిర్మించాలని కోరుతూ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ప్రసాద్ తదితర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి ఆరామ క్షేత్రం నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. గతంలో ఆరామ క్షేత్రం కోసం స్థలం కేటాయించడం జరిగిందని, కేటాయించిన అదే స్థలంలో నిర్మాణ పనులు చేపట్టి విశ్వబ్రాహ్మణ సమాజానికి అందుబాటులోకి తీసుకురావాలని వారు ఎమ్మెల్యేను కోరారు.అద్దె ఇళ్లలో నివసిస్తూ, సొంత ఇళ్లు లేని విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరైనా మృతి చెందిన సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సొంత ఇల్లు లేని కుటుంబాల్లో మరణం సంభవించినప్పుడు మృతదేహాన్ని ఇంట్లో ఉంచేందుకు ఇంటి యజమానులు అంగీకరించకపోవడంతో, మృతదేహాన్ని ఆరామ క్షేత్రానికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. అయితే ప్రస్తుతం సరైన ఆరామ క్షేత్రం లేకపోవడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా మరణానంతరం నిర్వహించాల్సిన దశదినకర్మ తదితర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు కూడా సరైన వసతి లేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆరామ క్షేత్రం నిర్మాణం పూర్తయితే మృతదేహాన్ని ఉంచేందుకు, దశదినకర్మ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రత్యేక వసతి అందుబాటులోకి వస్తుందని, ముఖ్యంగా అద్దె ఇళ్లలో నివసించే నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వారు పేర్కొన్నారు.విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అందించిన వినతిపత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. ఆరామ క్షేత్రం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గతంలో కేటాయించిన స్థలంలో నిర్మాణం చేపట్టే అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి, అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.విశ్వబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమానికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఆరామ క్షేత్రం నిర్మాణానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడంపై విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను అర్థం చేసుకుని, కేటాయించిన స్థలంలో ఆరామ క్షేత్రం నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ప్రసాద్, సుధా కొండలరావు రమేష్ రాజేశ్వర చారి తదితర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.