
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
రైతు సంక్షేమమే ద్వేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం జరుగుమల్లి మరియు సింగరాయకొండ మండలం పాకలలో నిర్వహించిన "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…గత ప్రభుత్వంలో జరిగిన రీ సర్వే తప్పుల తడకగా మారిందని, సరిహద్దుల వివాదాలతో అనేకమంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. రీ సర్వే పొలాలకు సంబంధించి తమ భూములకు తప్పుగా హద్దులు పడ్డాయని ప్రజలు తెచ్చిన ఫిర్యాదులపై మంత్రి తక్షణమే స్పందిస్తూ, గతంలో జరిగిన పొరపాట్లన్నింటినీ సరిదిద్ది లబ్ధిదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎలాంటి తప్పులకు తావులేకుండా పారదర్శకంగా రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేశామని, 2027 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వేను పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారని స్పష్టం చేశారు. రైతుల సౌకర్యార్థం ప్రతి నెలా 9వ తేదీలోపు అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
పాసుపుస్తకాల పంపిణీకి సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలను మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 516 గ్రామాలు ఉండగా, అందులో 19 గ్రామాలు ముంపు మరియు పట్టణ ప్రాంత పరిధిలోకి వస్తాయని, మిగిలిన 497 గ్రామాలు రీ సర్వేకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే జిల్లాలో 287 గ్రామాల్లో రీ సర్వే పూర్తయిందని, మిగిలిన 210 గ్రామాల్లో సర్వే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. గత ఆగస్టు మాసం నాటికి జిల్లా వ్యాప్తంగా 201 గ్రామాల్లో మొత్తం 94,676 పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన 294 గ్రామాలకు సంబంధించి 3,03,558 పాసుపుస్తకాలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, సెప్టెంబరు 2026 నాటికి 23 గ్రామాల్లో 13,356 పుస్తకాలు, అక్టోబరులో 49 గ్రామాల్లో 37,894, నవంబరులో 43 గ్రామాల్లో 35,174, డిసెంబరులో 46 గ్రామాల్లో 52,660, జనవరి 2027 నాటికి 43 గ్రామాల్లో 52,624, ఫిబ్రవరిలో 47 గ్రామాల్లో 58,823 మరియు మార్చి 2027 నాటికి మిగిలిన 43 గ్రామాల్లో 51,107 పాసుపుస్తకాలను అందజేసి రీ సర్వే ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేస్తామని వివరించారు. అలాగే కొండపి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆగస్టు మాసం నాటికి మొత్తం 18,020 పాసుపుస్తకాలను అందించినట్లు తెలిపారు. ఇందులో కొండేపి మండలంలో 2,999, మర్రిపూడిలో 831, పొన్నలూరులో 2,049, సింగరాయకొండలో 2,329, టాంగూటూరులో 5,645, మరియు జరుగుమల్లి మండలంలో 4,167 పాసుపుస్తకాలు పంపిణీ అయ్యాయని తెలిపారు. ఇక జరుగుమల్లి మండల పరిధిలోని తుమాడు (392), చిరికూరపాడు (606), కామేపల్లి అగ్రహారం (120), పి.ఎమ్.కండ్రిక (46), ఎన్.ఎమ్.వి.కండ్రిక (59), నందనవనం (764), పి.జి.కండ్రిక (148), ఎడ్లూరుపాడు (694), పైడిపాడు (252), పాలేటిపాడు (879), పి.ఎమ్.వి.కండ్రిక (139), ఐఎమ్‌వి కండ్రిక (68), జరుగుమల్లి (854), మరియు జె.జి.కండ్రిక (93) గ్రామాలలో కలిపి మొత్తం 5,114 పాసుపుస్తకాలను లబ్ధిదారులకు అందించినట్లు వెల్లడించారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై మాట్లాడుతూ, గతంలో పాలకులు హద్దురాళ్లు మరియు పాసుపుస్తకాలపై తమ సొంత ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకున్నారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అధికారిక రాజముద్రతో కూడిన భద్రమైన పాసుపుస్తకాలను ప్రజలకు అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో భూ హద్దులను ఎవరూ అక్రమంగా మార్చడానికి వీలులేకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, పాసుపుస్తకాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక QR కోడ్ టెక్నాలజీ ద్వారా ఒక స్కాన్ చేస్తే లబ్ధిదారుల వివరాలు, మరొక స్కాన్ చేస్తే భూమి యొక్క ఖచ్చితమైన లొకేషన్ తెలిసేలా ఏర్పాట్లు చేశామని వివరించారు.
దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై స్పందిస్తూ, గర్భ కండ్రిక భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దాదాపు 4,000 ఎకరాలకు విముక్తి కలిగించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా చుక్కల భూములు, గయాలు, జాయింట్ LPMల వంటి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, త్వరలోనే వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసిందని గర్వంగా ప్రకటించారు. పాలేరు రిజర్వాయర్‌కు 0.6 TMC ల నీటిని కేటాయించడమే కాకుండా, 123 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సంగమేశ్వరం ప్రాజెక్టును మంజూరు చేశామని, త్వరలోనే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమ రంగానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తున్నామని తెలుపుతూ, అన్ని రకాల పింఛన్ల పెంపుతో పాటు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, అన్నా క్యాంటీన్లు, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి వంటి పథకాల ద్వారా సమాజంలో ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలను తక్షణమే అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రోడ్ల పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. డిజిటల్ పాలనలో భాగంగా 'మన మిత్ర' యాప్ ద్వారా 100కు పైగా ప్రభుత్వ ధృవీకరణ పత్రాలను పారదర్శకంగా అందిస్తున్నామని, అలాగే 'డిజిలాకర్' ద్వారా లభించే సేవలపై ప్రజలందరూ అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలని మంత్రి కోరారు.
