
కలెక్టరేట్లో ఘనంగా ఇళ్ల పట్టాలు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకుల అందజేత.
నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది: కలెక్టర్ ఎం. విజయ సునీత.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామైన సుంకేసుల గ్రామ నిర్వాసితులకు తోకపల్లి లేఔట్లో కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు, నిత్యావసర సరుకులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అందజేశారు. స్థానిక మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎర్రగొండపాలెం తెదేపా ఇన్చార్జ్ ఎరిక్షన్ బాబులతో కలిసి నిర్వాసిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలతో పాటు, ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఉచిత నిత్యావసర వస్తువులు, చీర, గాజులు, పసుపు, కుంకుమలను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తోకపల్లి లేఔట్లో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఆదర్శ నివాస ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, నిర్వాసిత కుటుంబాలు త్వరితగతిన ఇళ్లను నిర్మించుకుని స్థిరపడాలని ఆకాంక్షించారు. నిర్వాసితులకు రావాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించేందుకు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ వెంకటశివరామి రెడ్డి, సుంకేసుల గ్రామ నిర్వాసితులు, తదితరులు పాల్గొన్నారు.