
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:
స్థానిక భాష్యం పబ్లిక్ స్కూల్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ముందస్తు వినాయక చవితి వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పూలు, మామిడాకులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు శోభాయమానంగా అలంకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. రంజాన్ గారు మరియు హెచ్ ఎం తబుసమ్ స్వామివారి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్. రంజాన్ మాట్లాడుతూ, మన సంస్కృతీ సాంప్రదాయాలను, పండుగల విశిష్టతలను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే పాఠశాలలో ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏ పని ప్రారంభించినా విఘ్నాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరుడిని పూజించడం మన సాంప్రదాయమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం హెచ్ ఎం తబుసమ్ మాట్లాడుతూ, పండుగలు విద్యార్థులలో ఐక్యతను, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించి ప్రకృతిని కాపాడుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు గణపతి ఆరాధన, సాంస్కృతిక నృత్యాలు, శ్లోక పఠనాలతో అలరించారు. గణేశుడి రూపంలో వేషధారణ ధరించిన చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరగా స్వామివారికి నైవేద్యం సమర్పించి, హాజరైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.