
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని సంబందిత అధికారులను మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. శనివారం తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో కొండపి నియోజకవర్గ జలవనరులు, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగమేశ్వర ప్రాజెక్టు టెండర్ల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు, టెండర్లు పూర్తి అయ్యాయని అధికారులు మంత్రికి తెలిపారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…ఎల్ నినో నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపి ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జలధార, జలహారతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వెలుగొండ ఫేజ్ 2 లో సంగమేశ్వరం ప్రాజెక్టు కేటాయించిన 1.09 టీఎంసీల నీరు నింపేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.