
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
ఒంగోలు: NDA కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఒంగోలు రాంనగర్ రెండవ లైన్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
కూటమి పార్టీల అధిష్టానం ఇచ్చిన దిశానిర్దేశాల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని, ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కూటమి పార్టీల మధ్య పరస్పర సమన్వయం, సహకారంతో పనిచేస్తూ ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించి ప్రజల మద్దతును కూడగట్టాలని నాయకులు దిశానిర్దేశం చేశారు.
మూడు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మరియు కనిగిరి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు గారు, మార్కాపురం జిల్లా బిజెపి అధ్యక్షులు పి.వి కృష్ణారావు గారు, జనసేన ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు పెద్దపూడి విజయకుమార్ గారు, శ్రీమతి రాయపాటి అరుణ గారు, వరికుటి నాగరాజు పాల్గొన్నారు.