
విగ్రహ నిర్వాహకులకు భద్రతా సూచనలు – నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసుల ఆదేశాలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గణేష్ విగ్రహాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.వినాయక విగ్రహాల ఏర్పాటు, పూజా కార్యక్రమాలు, ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు మరియు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వేడుకలను నిర్వహించాలని తెలిపారు.విద్యుత్ భద్రత, అగ్నిప్రమాదాల నివారణ, జనసమ్మర్ధం నియంత్రణ, శబ్ద కాలుష్య నియంత్రణ, ఊరేగింపు మార్గాల్లో క్రమశిక్షణ, నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక సూచనలు చేశారు.వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ప్రకాశం జిల్లా పోలీసులు కోరారు.