
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్డులో ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 34వ వార్షిక గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సుమారు లక్ష గోల్డ్ ఇమిటేషన్ శ్రీలక్ష్మీ కాసులతో ప్రత్యేకంగా అలంకరించిన 12 అడుగుల మట్టి వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
శ్రీలక్ష్మీ కాసులతో రూపొందించిన వినాయకుడి శోభను తిలకించేందుకు సింగరాయకొండతో పాటు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కృష్ణ ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక అలంకరణతో వెలసిన లక్ష్మీకాసుల వినాయకుడు ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.