
భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాలు – ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
మార్కాపురం జిల్లా వ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలు పోలీసుల పటిష్ట భద్రతా పర్యవేక్షణలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులు, నిర్వాహకులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.నిమజ్జన శోభాయాత్రలు జరిగే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, రూట్ మళ్లింపులు, వాహనాల రాకపోకల పర్యవేక్షణ, నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో ప్రజలు ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లకుండా అప్రమత్తం చేస్తూ, చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగేందుకు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరిస్తున్న నిర్వాహకులు, భక్తులకు మార్కాపురం జిల్లా పోలీసులు అభినందనలు తెలిపారు.ప్రశాంతమైన గణేష్ నిమజ్జనాలు.. ప్రజల భద్రతే మార్కాపురం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం!