
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు.. శోభాయాత్రల మార్గాల్లో విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర నిఘా
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న గణేష్ విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.నిమజ్జన శోభాయాత్రలు జరిగే ప్రధాన మార్గాలు, కూడళ్లు, నిమజ్జన ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించి ప్రజల రాకపోకలు, వాహనాల రద్దీ, శోభాయాత్రల క్రమబద్ధమైన నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తూ పోలీసు అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు.నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరిగేలా ఉత్సవ నిర్వాహకులు మరియు భక్తులు పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు పాటిస్తూ సహకరించాలని పోలీసులు కోరారు.భక్తుల ఆనందం.. ప్రజల భద్రత.. ప్రశాంతమైన గణేష్ నిమజ్జనాలే ప్రకాశం జిల్లా పోలీసుల లక్ష్యం!