
జిల్లా ఇన్చార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:-
విశాఖ నగర పరిధిలోని పేద ప్రజలకు వారు నివసిస్తున్న భూములపై శాశ్వత హక్కులు కల్పిస్తూ కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి ఎన్డీయే (NDA) ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయ మరియు గ్రామ వాలంటీర్ శాఖ మాత్యులు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం శుక్రవారం సాయంత్రం పత్రిక ప్రతినిధులతో జిల్లా ఇన్చార్జి మంత్రి సమావేశం అయ్యారు.జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…..
విశాఖలో పేదల భూములకు హక్కుల పంపిణీకి సర్వం సిద్ధం చేయడం జరిగిందని, రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైభవంగా కన్వేయన్స్ డీడ్ల అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ ద్వారా విశాఖపట్నంలోని దాదాపు 28,500 మందికి పైగా నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు ఉన్నట్లు తెలిపారు. 2014-2019 కాలంలో నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల ఆధారంగా పేదలకు భూహక్కులు కల్పించాల్సి ఉండగా, గత ప్రభుత్వం ఈ ప్రక్రియను పక్కన పెట్టి కన్వేయన్స్ డీడ్ల పంపిణీని నిలిపివేశారని విమర్శించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ. 8,500 కోట్లు, మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన భూమిపై పేదలకు సర్వహక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ డీడ్ల ఆధారంగా లబ్ధిదారులు తమ అవసరాల కోసం బ్యాంకుల నుండి రుణాలు పొందే వెసులుబాటు కూడా కలుగుతుందని వివరించారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ ప్రాంతంలో విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 100 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రతి కౌంటర్ వద్ద ఆరుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి కౌంటర్ ద్వారా 300 మందికి ఇబ్బంది లేకుండా డీడ్లు పంపిణీ చేస్తారని మంత్రి తెలిపారు. వేలిముద్రల సేకరణ నుండి పత్రాల అందజేత వరకు ప్రక్రియ సులభంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నారని , ఈ సదవకాశాన్ని లబ్ధిదారులందరూ క్రమ శిక్షణతో వినియోగించుకోవాలని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.