
కందుకూరులో ఆరు నెలల ప్రీమెచ్యూర్ బేబీకి అరుదైన వైద్యం…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని శక్తి చిల్డ్రన్స్ హాస్పిటల్లో కేవలం 26 వారాలకే జన్మించిన శిశువుకు 45 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించి ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్‌కు సిద్ధం చేసినట్లు చిన్నపిల్లల ఐసీయూ వైద్యులు డాక్టర్ కె.వి.అశోక్ చౌదరి తెలిపారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.నీలిమ అనే గర్భిణికి నవంబర్ 2న ప్రసవ తేదీ ఉండగా, ఆగస్టు 4న నొప్పులు రావడంతో కందుకూరులోని ఓ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ జరిగినట్లు తెలిపారు. 40 వారాలు గర్భంలో ఉండాల్సిన శిశువు 26 వారాలకే జన్మించడంతో తక్కువ బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. శక్తి చిల్డ్రన్స్ హాస్పిటల్లో 45 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించామని, 10 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచడంతో పాటు గుండె సమస్య, రక్తహీనతకు చికిత్స అందించామని తెలిపారు. మూడు సార్లు రక్తం ఎక్కించినట్లు చెప్పారు.
“సక్సెస్ వెనుక డబ్బు కాదు.. మా టీం, తల్లిదండ్రుల సహకారమే మా బలం” అని డాక్టర్ అశోక్ చౌదరి పేర్కొన్నారు. 45 రోజుల ఐసీయూ చికిత్సలో 39 రోజుల పాటు యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా చికిత్స అందించడం తమ టీం సాధించిన విజయమని తెలిపారు.తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చికిత్సలో రాయితీ కూడా కల్పించినట్లు చెప్పారు.కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్, శిశువు తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.