
విధి పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావంతో జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలు మరువలేనిది:జిల్లా ఎస్పీ
విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషం, ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు అత్యుత్తమ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు (37 సం' సర్వీస్), పీసీఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై కె. వేణుగోపాల్ (SI-466, 41 సం' సర్వీస్), ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎఎస్సై ఎస్.కె. జిలానీ బాషా (ASI-1668, 34 సం' 8 నెలల సర్వీస్), అలాగే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందిన త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లో హైకోర్టు లైజన్ ఎఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్. రామారావు (ASI-1773, 33 సం' సర్వీస్)లను బుధవారం జిల్లా పోలీసు కల్యాణ మండపంలో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీసు అధికారులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖకు సుదీర్ఘకాలం పాటు నిబద్ధత, అంకితభావంతో అందించిన సేవలను ఎప్పటికీ మరువలేమని, విధి నిర్వహణలో కేటాయించిన అన్ని విధులను సమర్థవంతంగా నిర్వహించి మంచి అధికారులుగా పేరు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతో పోలిస్తే పోలీసు శాఖలో విధులు భిన్నంగా ఉంటాయని, ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ సేవలందించే అవకాశం పోలీసు శాఖలోనే అధికంగా ఉంటుందన్నారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో చూపిన నైపుణ్యం, వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం సమయంలో తీసుకున్న చర్యలు, కోర్టులో లైజన్గా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయని అన్నారు. వారి సర్వీసులో అనేక క్లిష్టమైన కేసులు ఎదురైనప్పటికీ, మనోధైర్యంతో, నాయకత్వ నైపుణ్యంతో వాటిని విజయవంతంగా పరిష్కరించారని తెలిపారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించి, తమ పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్ది, వారు ఉన్నత స్థానాల్లో నిలిచేలా చేశారన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జీవితాన్ని ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్లో ఎటువంటి సహకారం అవసరమైనా పోలీసు శాఖ తప్పకుండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం ఓఎస్డీ (అడ్మిన్)నవజ్యోతి మిశ్రా ఐపీఎస్ గారు, ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) యన్.యుగంధర్ బాబు,కందుకూరు డిఎస్పీ బాలసుబ్రమణ్యం,దర్శి డిఎస్పీ బాల మురళి కృష్ణ, సీఐలు,ఎస్సైలు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.