
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపు
20 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా లింగసముద్రం మండలం మాలకొండరాయుని పాలెం పంచాయితీలోని ముక్తేశ్వరం గ్రామంలో పలువురు వృద్ధులు, వికలాంగులకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు గురువారం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0 ద్వారా ఎస్సీ కాలనీలో 20 లక్షలతో నిర్మించి పోయే సీసీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, స్మశానానికి కొత్తగా నిర్మించిన గ్రావెల్ రోడ్లను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. స్మశానానికి ఫెన్సింగ్, లోపల బోరు త్వరగా ఏర్పాటు చేయించాలని ఎంపీడీవోను ఆదేశించారు.త్వరలో ముక్తేశ్వరం నుంచి వలేటివారిపాలెం వరకు 20 లక్షలతో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. తాగునీరు, వీధిలైట్ల సమస్యలను వారంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విశ్వనాధపురం నుంచి గంగపాలెం మధ్య కొత్తగా తారురోడ్డు పనులు త్వరలో మొదలవుతాయని చెప్పారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని రోడ్లను బాగు చేశామన్నారు. నియోజకవర్గంలో మోస్ట్ సీనియర్ అని చెప్పుకుంటున్న కొందరు, వీటి గురించి ఎందుకు పట్టించుకోలేదని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్లుగా, అధికారంలోకి రాగానే వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6వేలు, శాశ్వత దివ్యాంగులకు 15వేల చొప్పున పింఛన్ అందిస్తున్నారని చెప్పారు. పేదల సంతోషం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, చక్కగా వ్యాపారాలు నిర్వహించుకుని లాభాలు పొందడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా, నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. ఈసారి పంచాయితీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసిల్దార్ కోటేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జ్ వంకాయలపాటి మాల్యాద్రి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు మాధవరపు వెంకట్రావు, గ్రామ నాయకులు పొంకం బ్రహ్మయ్య, రమణయ్య, డేగా శ్రీను, మల్లిబోయిన నరసింహారావు, కొల్లిబోయిన మనోజ్, నరాల బాలకృష్ణ, నలగట్ల శ్రీను, బొల్లినేని నాగేశ్వరరావు, ఉన్నం వీరాస్వామి, సోంపల్లి మనోహర్, రాజారపు మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.