
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:
పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పరిమితం చేయకుండా, పేద విద్యార్థులకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని సింగరాయకొండ తహసీల్దార్ రాజేష్, మండల విద్యాశాఖాధికారులు ఆవుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన్నీరు శ్రీనాధ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తండ్రి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన్నీరు వెంకటేశ్వర్లు ఆర్థిక సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 75 మంది విద్యార్థులకు సుమారు రూ.లక్ష విలువైన నూతన దుస్తులను శుక్రవారం పంపిణీ చేశారు.బింగినపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గవదగట్లవారిపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరాయకొండ తహసీల్దార్ రాజేష్, మండల విద్యాశాఖాధికారి ఆవుల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు నూతన దుస్తులను అందజేశారు. అనంతరం విద్యార్థులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది: తహసీల్దార్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దుస్తులు అందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని సింగరాయకొండ తహసీల్దార్ పేర్కొన్నారు. పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాలను సామాజిక సేవకు వినియోగించడం ద్వారా సమాజంలో సేవా స్ఫూర్తి మరింత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి సహకారం అందిస్తున్న తన్నీరు కుటుంబాన్ని అభినందించారు.సేవా కార్యక్రమాలు ఆదర్శనీయం: ఎంఈఓ
విద్యార్థుల చదువుతో పాటు వారి అవసరాలను గుర్తించి సహకరించడం అభినందనీయమని మండల విద్యాశాఖాధికారి ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దాతలు, సేవా సంస్థలు అందిస్తున్న సహకారం పాఠశాలలతో సమాజానికి అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు కూడా స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, అర్రిబోయిన రాంబాబు, జిల్లా ఎం.ఐ.ఎస్. ప్లానింగ్ కోఆర్డినేటర్ మసనం జాలరత్నం, ఉపాధ్యాయులు మసనం మాలిరావు,న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, పూడి రరోసిరెడ్డి, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన్నీరు శ్రీనాధ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
