
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ వెలుగులు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర తనిఖీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లాలోని సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోని కాంపౌండ్ వాల్, ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ద్వారాలు, విద్యుత్ వెలుగులు (ఇల్యూమినేషన్), పరిసర ప్రాంతాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా తనిఖీ చేశారు.ఓటర్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు సక్రమంగా ఉండేలా చూడాలని, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రత్యేకంగా అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో గత పరిస్థితులు, ప్రస్తుత భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతర నిఘా, సమన్వయం, పటిష్ట పోలీస్ బందోబస్తు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రకాశం జిల్లా పోలీసులు అన్ని ముందస్తు భద్రతా చర్యలను చేపడుతున్నారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టేందుకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు.