
బస్స్టాండ్లు, కళాశాల మైదానాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తున్న వారికి పరీక్షలు – అనంతరం కౌన్సెలింగ్
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.కందుకూరు సీఐ శ్రీ ఎస్. జగదీష్ గారు కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సంబంధిత సిబ్బంది సహకారంతో డ్రగ్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. బస్‌స్టాండ్ పరిసరాలు, కళాశాల మైదానాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను యాదృచ్ఛికంగా గుర్తించి పరీక్షలు నిర్వహించారు.పరీక్షల అనంతరం అవసరమైన వారికి మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలపై కౌన్సెలింగ్ నిర్వహించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పోలీసులు వివరించారు. యువతను డ్రగ్స్ రహిత వాతావరణంలో పెంచేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు, డ్రగ్ టెస్టులు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ వంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.“డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోండి” అని కందుకూరు పోలీసులు ప్రజలకు సూచించారు.