
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:
విద్యారంగంలో విశేష సేవలందిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న అర్రిబోయిన రాంబాబుకు యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాంబాబుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ గవదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాంబాబు విద్యాబోధనలో ఆధునిక పద్ధతులు, సాంకేతికతను మేళవిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు తాజాగా గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల విద్యార్థుల విద్యాభివృద్ధికి రాంబాబు కృషి చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు అందించడంతో పాటు కరోనా సమయంలో నిత్యావసర సరుకులు, వైద్య సేవలు అందించేందుకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ‘వస్త్ర నేస్తం’, ‘వృథా సుధా’, ‘పుష్ప సంకల్పం’ తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ అధికారులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ సామాజిక సేవకు తనవంతు కృషి చేస్తున్నారు.
విద్యతో పాటు సామాజిక సేవా రంగంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందని రాంబాబు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి విద్యాభివృద్ధికి, సమాజ సేవకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.డాక్టరేట్ అందుకున్న రాంబాబును పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మిత్రులు, విద్యాభిమానులు అభినందించారు.