
కార్మికులు తమ హక్కులను తెలుసుకోవాలి – న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
రొయ్యల పరిశ్రమ కార్మికులకు ఆరోగ్యం, భద్రత, సామాజిక సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
లేబర్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, సార్డ్స్ సంస్థల సమన్వయంతో నిర్వహిస్తున్న శ్రింప్ సినర్జీ ప్రాజెక్ట్లో భాగంగా స్థానిక పాత సింగరాయకొండ పరిధిలోని ఆల్ఫా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ షేక్ అష్మా హాజరయ్యారు.ఈ సందర్భంగా పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మహిళా కార్మికుల ఆరోగ్యం, భద్రత, పని ప్రదేశాల్లో వారి రక్షణకు సంబంధించిన చట్టపరమైన అంశాలను వివరించారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు.రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, పని ప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి చట్టపరమైన మార్గాలను వినియోగించుకోవాలని న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు సూచించారు. మహిళల గౌరవం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి పరిశ్రమలో సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు చట్టప్రకారం అవసరమైన చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయడం, ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని జెండర్ ఎక్స్పర్ట్ సంధ్య వివరించారు. మహిళా కార్మికులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసే వాతావరణాన్ని యాజమాన్యాలు కల్పించాలని పేర్కొన్నారు.కౌన్సెలర్ బాషా మాట్లాడుతూ, కార్మికులకు అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా పథకాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రయోజనాలు, అర్హతల గురించి వివరించారు. అర్హులైన కార్మికులు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలని సూచించారు.కార్యక్రమానికి సార్డ్స్ సిబ్బంది కోటయ్య అధ్యక్షత వహించగ,ఆల్ఫా మెరైన్స్ మేనేజ్మెంట్ తరఫున వెంకటేశ్వర్లు మరియు మస్తాన్,సార్డ్స్ సిబ్బంది, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ కార్మికులు, సంబంధిత శాఖల కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొన్నారు.