
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (APSEC) మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపిటిసి, జెడ్పిటిసి మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి) తక్షణమే అమలులోకి వచ్చిందని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజా బాబు గారు ఎన్నికల షెడ్యూల్ వివరాలను సమగ్రంగా వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలకు అక్టోబర్ 14. 2026న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అక్టోబర్ 16 ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 18 చివరి తేదీ కాగా, అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 21 మధ్యాహ్నం 3:00 గంటల వరకు గడువు ఉంటుంది, ఆ తర్వాత అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 28న పోలింగ్, అక్టోబర్ 29న అవసరమైతే రీ-పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 30, 2026న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.అలాగే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలకు అక్టోబర్ 19, 2026న ఎలక్షన్ నోటిఫికేషన్, అక్టోబర్ 21న ఆర్ఓ/ఈఓల ద్వారా ఎన్నికల నోటీసు జారీ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 23 చివరి తేదీ కాగా, అక్టోబర్ 24న పరిశీలన, అక్టోబర్ 25న తిరస్కరణలపై అప్పీలు , అక్టోబర్ 26న అపీళ్ల పరిష్కారం, అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ మరియు పోటీలోని అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 4న రీ-పోలింగ్ (అవసరమైతే) నిర్వహించి, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపడతారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో (3 Phases) నిర్వహిస్తున్నారు. ఫేజ్-1కు నవంబర్ 13న నోటిఫికేషన్, నవంబర్ 15న ఆర్ఓ/ఈఓల నోటీసు, నవంబర్ 17 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 18న పరిశీలన, నవంబర్ 19న తిరస్కరణపై అపీలు, నవంబర్ 20న అపీళ్ల పరిష్కారం, నవంబర్ 21న ఉపసంహరణ & తుది జాబితా వెల్లడి, నవంబర్ 26న పోలింగ్ మరియు నవంబర్ 29న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఫేజ్-2 మరియు ఫేజ్-3 ఎన్నికలు ప్రతిదానికీ 3 రోజుల వ్యవధితో ఇదే క్రమంలో కొనసాగుతాయి. పరోక్ష ఎన్నికల (Indirect Elections) విషయానికి వస్తే యుఎల్బీలకు అక్టోబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 1న మెంబర్లకు నోటీసులు అందించి, నవంబర్ 5 లేదా 6 తేదీల్లో ప్రత్యేక సమావేశం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఎంపిటిసి/జెడ్పిటిసి పరోక్ష ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న, పంచాయతీలకు నవంబర్ 13న విడుదల కానున్నాయి. ప్రకాశం జిల్లా పరిధిలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉండగా, ప్రస్తుతం కందుకూరు మినహా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మరియు దర్శి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డుల పునర్విభజన (Delimitation) ద్వారా ఈ స్థానిక సంస్థలలో వార్డుల సంఖ్య గతంలో ఉన్న 110 నుండి 150కి పెరిగింది. ఇందులో ఒంగోలు కార్పొరేషన్ వార్డులు 50 నుండి 62కి, అద్దంకి 20 నుండి 32కి, చీమకుర్తి 20 నుండి 28కి మరియు దర్శి 20 నుండి 28కి పెరిగాయి. జిల్లాలో మొత్తం 2,77,565 మంది ఓటర్లు (పురుషులు: 1,33,470, మహిళలు: 1,44,034, ఇతరులు: 61) ఉన్నారని, పోలింగ్ కేంద్రాల సంఖ్యను గతంలో ఉన్న 294 నుండి 354కి పెంచడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఓటర్లలో సామాజిక వర్గాల వారీగా బీసీలు 1,00,636, ఎస్సీలు 44,724, ఎస్టీలు 8,054 మరియు ఇతర వర్గాలు 1,24,151 మంది ఉన్నారు. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళల రిజర్వేషన్ల జాబితా కూడా సిద్ధం చేసి ప్రచురించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు ఇవిఎమ్ల (EVMs) ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరుగుతాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి (MCC) అమలులో ఉన్నందున ఏ పార్టీ లేదా అభ్యర్థి కులాలు, మతాలు, భాషల మధ్య ద్వేషాలు లేదా విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరించరాదని హెచ్చరించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిమితులను కూడా కమిషన్ ఖరారు చేసింది; మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి రూ. 25 లక్షలు, కార్పొరేషన్ వార్డు మెంబర్కు రూ. 10 లక్షలు, మున్సిపల్ చైర్పర్సన్కు రూ. 20 లక్షలు, మున్సిపల్ వార్డు మెంబర్కు రూ. 7.50 లక్షలు, నగర పంచాయతీ చైర్పర్సన్కు రూ. 10 లక్షలు మరియు వార్డు మెంబర్కు రూ. 5 లక్షలుగా పరిమితిని నిర్ణయించారు. అలాగే నామినేషన్ డిపాజిట్ ఫీజు కార్పొరేషన్కు రూ. 5,000 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 2,500), మున్సిపాలిటీలకు చైర్మన్/వార్డు మెంబర్ అభ్యర్థులకు నిర్దేశించిన రుసుములను నిర్ణయించారు.
ఎన్నికల నిర్వహణ కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాలను ముందస్తుగానే తనిఖీ చేశామని కలెక్టర్ తెలిపారు. సున్నితమైన (Sensitive), అత్యంత సున్నితమైన (Hyper-sensitive) మరియు క్రిటికల్/వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను పోలీసు శాఖతో కలిసి గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను, కోడ్ అమలును మరియు పోలింగ్ కార్యకలాపాలను జాయింట్ కలెక్టర్ (JC) స్వయంగా పర్యవేక్షిస్తారని, ఎన్నికల వ్యయ నియంత్రణ స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇప్పటికే రంగంలోకి దిగాయని వివరించారు. త్వరలోనే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.మీడియా మిత్రులకు ఎన్నికల సమాచారం నిరంతరాయంగా, పారదర్శకంగా అందజేసేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా ' మీడియా సెల్' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా వచ్చి ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డి.ఆర్.ఓ. వెంకటరమణ, జెడ్పీ సిఈఓ చిరంజీవి, ఈడీ బీసీ కార్పొరేషన్ వెంకటేశ్వరరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.