
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలు, కాలనీల్లో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహించారు.ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ముండ్లమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుపుగల్లు గ్రామం, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మనబ్రోలు గ్రామం, పేర్నమిట్ట శాంతినగర్ ప్రాంతం, దర్శి పట్టణంలోని కొత్తరెడ్డిపాలెం, అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, కొండేపి పోలీస్ స్టేషన్ పరిధిలోని కూచిపూడి బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఇళ్లు, వాహనాలపై క్షుణ్ణంగా తనిఖీలు
పోలీసు అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లో ఇళ్లను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలను తనిఖీ చేస్తూ సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, నేరాలకు ఆస్కారం ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ప్రజలతో మమేకమై అవగాహన కార్యక్రమాలు దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తరెడ్డిపాలెంలో పోలీసులు స్థానిక ప్రజలతో, గ్రామ పెద్దలతో మాట్లాడి ప్రజా భద్రత, నేరాల నియంత్రణ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణపై అవగాహన కల్పించారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.ప్రజల భద్రతే మా ప్రాధాన్యత – నేరాల నియంత్రణకు నిరంతర నిఘా.. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు.. ప్రజల సహకారంతో సురక్షిత సమాజ నిర్మాణమే పోలీసుల లక్ష్యం!