
గాంధీనగర్ నుంచి బైక్ ర్యాలీతో ప్రదర్శన
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు కోరారు . ఆదివారం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 45వ డివిజన్ నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సయ్యద్ హుస్సేన్ నామినేషన్ సందర్భంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై గత 25 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న హుస్సేన్కు ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
సయ్యద్ హుస్సేన్ నామినేషన్ సందర్భంగా గాంధీనగర్లోని భగత్సింగ్ విజ్ఞాన కేంద్రం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్లోని వివిధ కాలనీలు, వీధుల మీదుగా సాగిన ర్యాలీ అనంతరం పీవీఆర్ హైస్కూల్ వద్ద నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన సయ్యద్ హుస్సేన్ సీపీఎం నగర కమిటీ నాయకుడిగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలోనూ ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిస్టు పార్టీకి ఆదరణ తెలిపారని గుర్తుచేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు కెఎఫ్ బాబు, నగర నాయకులు టి. మహేష్, 45వ డివిజన్ నాయకులు షేక్ పీర్ సాహెబ్, టి. దాసు, టి. సురేష్, మాలకొండయ్య, జాన్బాషా, జబ్బార్ షేక్, సిద్ధయ్య, ఆర్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.