
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయమని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం కొండపి నియోజకవర్గంలోని కొండపి, టంగుటూరు, పొన్నలూరు, మర్రిపూడి, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో కూటమి ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కూటమి అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర ఏళ్లలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజల ఆశీర్వదంతోనే నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థల స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు గొడ్డలి పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. ఓడిపోతామన్న భయంతోనే కొన్నిచోట్ల గొడ్డలి పార్టీ దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజలతో మమేకమై పనిచేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు.