
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో, ప్రతి ఆదివారం రోజు మెడికల్ షాపులు తెరిచే విషయంలో, యజమానుల మధ్య వివాదం మొదలైంది. హోల్ సేల్ షాపుగా పేరొందిన కీర్తి మెడికల్స్ పై, స్థానిక మెడికల్ షాప్ యజమానులు ఆగ్రహంతో ఉన్నారు. ప్రకాశం జిల్లా మెడికల్ షాపుల అసోసియేషన్ తీర్మానం మేరకు…. కందుకూరులో ప్రతి ఆదివారం రోజు కొన్ని షాపులు మాత్రమే తీయాలి. మిగిలిన షాపులు మరుసటి ఆదివారం తీసుకొని వ్యాపారాలు నిర్వహించాలి. గత 15 సంవత్సరాలుగా ఈ నియమం కొనసాగుతోంది. కందుకూరు యజమానులు నిర్వహించే షాపులలో, కేవలం కొద్దిమంది ఖాతాదారులకు మాత్రమే అతి తక్కువ డిస్కౌంట్లు ఇచ్చేవారు. అదికూడా 5 శాతంలోపే ఉండేది.2018 లో ఒంగోలు వాళ్ళు, ఇక్కడ కీర్తి మెడికల్స్ హోల్ సేల్ వ్యాపారం ప్రారంభించారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల మందులపై 18 శాతం డిస్కౌంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో స్థానిక వ్యాపారుల్లో ఈర్ష్య మొదలైంది. ఇటీవల ధర్మ మెడికల్స్ పేరుతో మరొక హోల్ సేల్ బిజినెస్ ప్రారంభించారు.అసోసియేషన్ నియమాల ప్రకారం ఒక ఆదివారం కీర్తి, మరో ఆదివారం ధర్మ షాపులు తెరవాలి. అయితే ధర్మ షాప్ తీసిన ఆదివారం రోజున, తమ బేరాలన్నీ పోతున్నాయని కీర్తి షాప్ యాజమాన్యం బాధ.ఈ నేపథ్యంలో నిన్నటి ఆదివారం, కీర్తి మెడికల్ షాపును తీసి అమ్మకాలు జరిపారు. ఈ నేపథ్యంలో మిగతా షాపుల యజమానులు… కీర్తి షాపుకు వెళ్లి వారిని నిలదీశారు. యూనియన్ నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించారు. మా ఇష్టం, మీరు చేసేది చేసుకోండి అని కీర్తి షాపు వారు తెగేసి చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో వ్యవహారం ఒంగోలులోని యూనియన్ చెంతకు చేరింది. యూనియన్ నిబంధనలను పాటించకుండా, కీర్తి యాజమాన్యం హద్దులు దాటుతోందని స్థానిక వ్యాపారులు గుర్రుగా ఉన్నారు. యూనియన్ సమావేశంలో తాడోపేడో తేల్చుకుంటామని చెబుతున్నారు.