
తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో పోలీస్ గస్తీ, అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం, రెవెన్యూ శాఖలతో సమన్వయ చర్యలు:జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గార్లు కలిసి మంగళవారం నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో పర్యటించారు. సముద్ర తీరాన్ని వారు పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తుఫాన్ షెల్టర్ కేంద్రాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ తుఫాన్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సముద్రం వద్దకు వెళ్ళవద్దని సూచించారు. తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ తుఫాన్ తీవ్రతపై డప్పు చాటింపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ గారు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లు, ట్రాక్టర్లు, పొక్లెయిన్లు, మిషన్ రంపాలు, పెట్రోల్ బంకులలో పూర్తిస్థాయిలో ఇంధనాన్ని అందుబాటులో పెట్టుకోవాలన్నారు. పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని, వృద్ధులు, బాలింతలు, గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తుఫాన్ షెల్టర్ లో అవసరమైన మందులను అందుబాటులో పెట్టుకోవాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా కలెక్టర్ కార్యాలయంతోపాటు తహసిల్దార్ కార్యాలయంలోనూ కాల్ సెంటర్ ఏర్పాటు చేసామన్నారు. జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, తీర ప్రాంతంలో పోలీస్ గస్తీని మరింత పెంచామని, తుఫాన్ దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించే లక్ష్యంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. తీర ప్రాంతాల్లోని పరిస్థితులపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు, సమాచారం వేగంగా చేరవేసేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ సెట్‌ను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డిపిఓ అనుపమ, ఏపీ సిపిడిసిఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి రావు, పంచాయతీరాజ్, మండల స్థాయి అధికారులు ఉన్నారు.