
తెలుగు జాతి ఆత్మగౌరవం, తెగువకు చిరస్మరణీయ ప్రతీకగా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి పోరాటం: జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు, అగ్గి పిడుగు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ గారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి పోరాట పటిమను కొనియాడారు. బ్రిటిష్ పాలకుల నిరంకుశ విధానాల వల్ల మన్యం ప్రజలు ఎదుర్కొంటున్న దీనస్థితిగతులను గుర్తించి, వారిలో చైతన్యం నింపి విప్లవానికి నాంది పలికిన మహనీయుడు అల్లూరి సీతారామ రాజు గారని పేర్కొన్నారు. మన్యం ప్రజల హక్కులు, దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడి, కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతిగా ఆయన నిలిచారన్నారు. ఆయన సాగించిన సాయుధ పోరాటం భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. సీతారామరాజు గారు సాగించిన సాయుధ పోరాటం తెలుగు జాతి చరిత్రలో గొప్ప ఘట్టంగా చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, తెలుగు జాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమని, ఆయన త్యాగశీలిని, పోరాటపటిమను స్పూర్తిగా తీసుకొని నేటి యువత సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.