
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డు ST కాలనీలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో రాగి.రవణమ్మకు చెందిన ఓ మేకతో పాటు దాని ఐదు పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.
బాధితురాలు రవణమ్మ మాట్లాడుతూ.. అప్పులు చేసి మేకలను పెంచుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, కన్నబిడ్డల్లా చూసుకున్న మేకలను ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేసి చంపివేశాయని కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన వల్ల దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసింది.“మా జీవనాధారమైన మేకలను కోల్పోయాం.. ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి నన్ను ఆదు కోవాలని ” అంటూ ఆమె బోరున విలపించింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కాలంలో ఎస్టీ కాలనీలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతోందని, గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. చిన్నపిల్లలు బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.