
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరులోని శ్రీ అంకమ్మ తల్లి షాపింగ్ కాంప్లెక్స్ యజమానుల సంఘం ఈరోజు మీడియా సమావేశం నిర్వహించింది. శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారికి షాపులఅద్దె రూపంలో మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్నామని షాపులు యజమానులు తెలిపారు. గతంలో తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసి, వారి వద్ద నుంచి అద్దెలు వసూలు చేసుకుని, ఆ డబ్బును అమ్మవారికి చెందకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు స్వాహా చేశారని విమర్శించారు. నేడు అలా కాకుండా దేవాదాయ శాఖ, మున్సిపాలిటీ అనుమతులతో వేలంపాటలో పాడుకుని దేవాదాయ శాఖ షరతులతో 11 సంవత్సరాలు షాపులు నిర్వహించుకునే విధంగా, సుమారు 10 లక్షల సొంత నిధులతో షాపులు నిర్మించుకున్నామని తెలిపారు.
ఒక్కో షాపుకు నెలకు 30 వేల వరకు భారం పడుతుందని, వ్యాపారం ఉన్నా, లేకున్నా అమ్మవారికి ప్రతినెలా తూచా తప్పకుండా అద్దెలు చెల్లిస్తూ అమ్మవారికి ఆదాయం సమకూరుస్తున్నామని వారు తెలిపారు. అయితే అమ్మవారికి ఆదాయం రావడం కొంతమందికి ఇష్టంలేక, భక్తుల ముసుగులో కోర్టుకు వెళ్లి షాపులను కూల్చివేసి, అమ్మవారికి ఆదాయం రాకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో ఎంతవరకైనా తాము పోరాటానికి సిద్ధమని యజమానులు స్పష్టం చేశారు. గతంలో దేవుడు సొమ్ము పందికొక్కులా మేసింది ఎవరనేది అందరికీ తెలుసన్నారు. అమ్మవారికి ఆదాయం రాకుండా చేసి ఆలయం మీద పెత్తనం చేయాలనుకునే వారి ఆటలు సాగవని అన్నారు. ఆలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు దేవాదాయ శాఖ, పోలీసులు చూసుకుంటారని, ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదని యజమానులు తెలిపారు. అన్నారు.