
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా డస్ట్ బిన్ తో చెత్త సేకరించి పరిసరాలు శుభ్రపరిచారు. అనంతరం నిర్వహించిన సభలో స్వచ్ఛతపై ప్రజల చేత మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం. అర్హులైన వారందరికీ తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగశక్తి, దీపం, అన్నదాత సుఖీభవ వంటి అన్ని పథకాలు అందజేస్తున్నాం. సెర్ప్, మెప్మా, డిఆర్ డిఎ సహకారంతో మహిళలకు సబ్సిడీకి రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి కల్పనతో వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. యుద్ధ ప్రభావం నేపథ్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రజలంతా పొదుపు చర్యలు పాటించాలి. పొదుపు చర్యల్లో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు రద్దు చేశారు. రాబోయే రోజుల్లో వచ్చే సమస్యలను ముందుగా అధిగమించేoదుకే ప్రభుత్వం పొదుపు చర్యల్ని చేపట్టింది. పొదుపు చర్యల్ని ప్రజలంతా పాటించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. అనంతరం సింగరాయకొండలో వరాహ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వీరాంజనేయస్వామిలను మంత్రి దర్శించుకున్నారు.
