
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యం సేవన కేంద్రాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంబంధిత జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్లో బహిరంగంగా మద్యం సేవనకు ఉపయోగిస్తున్న ప్రాంతాలను గుర్తించి తొలగింపు, శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.పోలీస్ అధికారులు, సిబ్బంది స్థానిక ప్రజలు, కమ్యూనిటీ సభ్యుల సహకారంతో బహిరంగ మద్యం సేవన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, అక్కడ మద్యం సేవిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అలాగే మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను పూర్తిగా శుభ్రపరిచారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా, గొడవలు, నేరాలకు దారితీసే అవకాశం ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. ప్రజా ప్రదేశాలను సురక్షితంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. బహిరంగ మద్యం సేవనం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.