
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
రాత్రివేళల్లో డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తు, అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రయాణికుల ప్రాణాలను కాపాడడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు వినూత్నమైన ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ డ్రైవర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి డ్రైవర్లకు ముఖం కడుక్కునే సౌకర్యం, టీ/తాగునీరు అందిస్తూ అలసటను తగ్గించి అప్రమత్తత పెంచుతున్నారు. నిరంతర ప్రయాణం వల్ల కలిగే మత్తు, ఏకాగ్రత లోపం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున చిన్న విరామం తీసుకుని సురక్షితంగా ప్రయాణం కొనసాగించాలని సూచిస్తున్నారు.“మీరు సురక్షితంగా గమ్యానికి చేరుకోవడం మాత్రమే కాదు… మీ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల కోసం కూడా జాగ్రత్తగా ఉండాలి” అనే సందేశంతో డ్రైవర్లలో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం కల్పిస్తున్నారు. అలసటతో డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని, కొద్ది నిమిషాల విశ్రాంతి ఎంతో పెద్ద ప్రమాదాన్ని నివారించగలదని పోలీసులు వివరిస్తున్నారు.ప్రజల ప్రాణ రక్షణే ప్రధాన లక్ష్యంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.