
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
మార్కాపురం రైల్వే స్టేషన్లో టూ-వీలర్ పార్కింగ్ నిర్వహణపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ వాహనాలను పార్కింగ్‌లో ఉంచాల్సి వస్తున్నప్పటికీ, వసూలు చేస్తున్న ఫీజులకు తగిన భద్రతా, రక్షణ సదుపాయాలు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్కింగ్ ప్రాంతంలో షెడ్లు లేకపోవడంతో వాహనాలు ఎండలు, వానలకు నేరుగా గురవుతున్నాయి. అలాగే సీసీ కెమెరాలు, భద్రతా గేట్లు వంటి కనీస భద్రతా చర్యలు కూడా కనిపించకపోవడంతో వాహనాల భద్రతపై ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ సరైన సేవలు అందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
“మేము డబ్బులు చెల్లిస్తున్నాం కానీ మా వాహనాలకు ఎలాంటి రక్షణ లేదు. తిరిగి వచ్చేసరికి వాహనం సురక్షితంగా ఉంటుందో లేదో అన్న భయం వెంటాడుతోంది” అని ప్రయాణికులు వాపోతున్నారు. పార్కింగ్ సిబ్బంది నుంచి కూడా సరైన స్పందన లేకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోందని పేర్కొంటున్నారు.
ఈ సమస్యలపై పర్యవేక్షణ వహించాల్సిన రైల్వే అధికారులు స్పందించాలని, పార్కింగ్ ప్రాంతంలో షెడ్లు, సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, గేట్లు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నుంచి ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో పార్కింగ్ యాజమాన్యం నాణ్యమైన సేవలు అందించే బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నారు……