
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్పీ శ్రీ బాలసుబ్రమణ్యం గారి అధ్వర్యంలో కందుకూరు సర్కిల్ సిఐ అన్వర్ భాష, సబ్ డివిజన్ 5 మంది ఎస్సైలు , 40 మంది పోలీస్ సిబ్బంది కలసి ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వరి చేను సంఘం గ్రామంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి వారి యొక్క వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేయటం నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.ఈ సందర్భంగా కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మాట్లాడుతూ క్రికెట్ ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి నష్టపోకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని,క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పే మోసగాళ్లను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. క్రికెట్ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్‌లలో పాల్గొని లక్షల రూపాయలు కోల్పోయిన వారు ఉన్నారని, ఇవి ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్ర నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నందున యువత ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మరియు ప్రజలు గంజాయి సహా అన్ని రకాల మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ మరియు ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల కాల్స్‌కు స్పందించి ఓటీపీలు చెప్పవద్దని హెచ్చరించారు. అలాగే ఆన్లైన్ గేమ్స్,క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, ఆధార్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు. చట్టాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, ప్రజలతో కలిసి “మత్తుకు దూరంగా ఉండాలి – మత్తు లేని సమాజాన్ని నిర్మిద్దాం” అనే ప్రతిజ్ఞ చేయించారు.గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు, ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 లేదా డయల్ 112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు.ఈ తనిఖీ లో ఉలవపాడు ఎస్సై జి.సుబ్బారావు,కొండేపి ఎస్సై టి.త్యాగరాజు, కందుకూరు ఎస్సై శివనాగరాజు, గుడ్లూరు ఎస్సై కె.వెంకట్రావు, వివి పాలెం ఎస్సై మదిరి నాయుడు మరియు 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.
