
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్ల మున్సిపాలిటీ నూతన కమిషనర్గా శ్రీ ఎం. చంద్ర మోహన్ గారు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ అధికారులతో సమావేశమై పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు మున్సిపల్ సేవల మెరుగుదలపై చర్చించారు.ఈ సందర్భంగా కమిషనర్ శ్రీ ఎం. చంద్ర మోహన్ గారు మాట్లాడుతూ బాపట్ల పట్టణ ప్రజలకు నాణ్యమైన మరియు వేగవంతమైన సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా మరియు వీధి విద్యుత్ దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.పట్టణంలోని అన్ని వార్డులలో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు డ్రైనేజీల శుభ్రత, చెత్త సేకరణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని, వీధి విద్యుత్ దీపాల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తామని, ప్రజల సూచనలు మరియు ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తామని కమిషనర్ తెలిపారు. ప్రజల సహకారంతో బాపట్లను పరిశుభ్రమైన, సుందరమైన మరియు అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.