
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
అవయవ దానం ఎంతో గొప్ప కార్యమని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు పేర్కొన్నారు. ఒంగోలు నగర శివారులోని ముక్తినూతలపాడు ప్రాంతానికి చెందిన కొమ్మూరి లక్ష్మయ్య (52) గారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఇంటి పెద్దను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవ దానానికి ముందుకు వచ్చారు. దీంతో కిమ్స్ వైద్యులు లక్ష్మయ్య గారి కాలేయం, కిడ్నీలు, కళ్లను సేకరించి ఇతరులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టారు.ఒక కిడ్నీని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి విజయవంతంగా అమర్చగా, మరో కిడ్నీని గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి, కళ్లను ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపించారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు, లక్ష్మయ్య గారి భార్య నాగదేవి, కుమారుడు షాలోమ్ రాజ వర్ధన్, కుమార్తెలు మరియు అల్లుళ్లను తన కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా సత్కరించారు . వారి సేవాభావాన్ని కొనియాడుతూ జీవనదాన్ సర్టిఫికెట్ను అందజేశారు.అలాగే లక్ష్మయ్య గారి భార్యకు ఒంగోలు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అవయవ దానాన్ని ప్రోత్సహిస్తూ, దాత కుటుంబానికి అండగా నిలిచిన కిమ్స్ వైద్య బృందాన్ని కూడా కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, కిమ్స్ సీఓఓ అంకిరెడ్డి, మెడికల్ డైరెక్టర్ శ్రీహరి రెడ్డి, వైద్యులు రమేష్ బాబు, రమణారెడ్డి, రామకృష్ణ, జగదీష్, బాల మురళి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.