
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తూ రెండు వేర్వేరు ప్రాంతాల్లో జూదంపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 12 మంది జూదరులను పట్టుకొని రూ.26,620 నగదు స్వాధీనం చేసుకున్నారు.కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లూరు గ్రామంలో ఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో జూదానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,050 నగదును స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా మర్రిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమవరం గ్రామ శివారు పొలాల్లో విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో తొమ్మిది మంది జూదరులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.24,570 నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కుటుంబాలను, సమాజాన్ని ఆర్థికంగా మరియు సామాజికంగా దెబ్బతీస్తాయని పోలీసులు తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై జిల్లాలో నిరంతర నిఘా కొనసాగుతోందని, జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
