
ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం
యువతకు ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక వైసీపీ విషం చిమ్ముతోంది
ఏడాది తర్వాత నిద్ర లేచి గొడ్డలి పార్టీ నాయకులు డీఎస్సీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు : -
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో పేదలకు మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నిపాడులో మంత్రి డా.స్వామి మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య 20 మంది మహిళలకు ఒక్కొక్కరికి మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. మేం పేదలకు మేలు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారు. వైసీపీ కుట్రలు చేదించి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నాం, ఇది పేద ప్రజల విజయం. జగన్ తన పెత్తందారి స్వభావం ఇంకా మార్చుకోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం. చెప్పిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే వైసీపీ ఓర్వలేక విషం చిమ్ముతోంది. 300 దివ్యాంగ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం. మెగా డీఎస్సీతో అత్యంత పారదర్శకంగా 13 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. డిఎస్సిపై వైసీపీ నాయకులు 200 పైగా కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏడాది తర్వాత నిద్రలేచి గొడ్డలి పార్టీ నాయకులు డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో జగన్ కనీసం ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. వైసీపీ హయాంలోనే గ్రూప్ 1 ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ ఏది చేసినా మోసమే. కొండపి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం, సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వైసీపీ ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హితవు పలికారు.
